Monday, March 11, 2013

Sripada Pinakapani,శ్రీపాద పినాకపాణి


  • image : courtesy with Eenadu news paper.
 పరిచయం :
  • సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు, ప్రముఖ వైద్యులు, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత, సంగీత కళానిధి శ్రీపాద పినాకపాణి 1913 ఆగస్టు 3న శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో జన్మించిరి.  శ్రీపాద పినాకపాణి బాల్యమంతా రాజమండ్రిలో గడచింది. 1957 నుంచి కర్నూలులో నివాసం ఉంటున్నారు. వైద్యాన్నివృత్తిగా, సంగీతాన్ని ప్రవృత్తిగా ఎంచుకుని రెండు రంగాల్లో విశిష్ట సేవలందించారు. ప్రభుత్వ వైద్యుడిగా 30 ఏళ్లపాటు పనిచేసిన ఆయన కర్నూలు బోధనాసుపత్రి పర్యవేక్షకులుగా సేవలందించారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చే పేద రోగులకు ఉచితంగా వైద్యం చేసిన పినాకపాణి సంగీత విద్వాంసుడిగా కీర్తి సంపాదించారు. గతేడాది ఆగస్టులో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 101 సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను ఘనంగా సత్కరించింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున గాన విద్యా వారధి పురస్కారం అందించారు.

మరణము :   కొంతకాలంగా అచేతన స్థితిలో మంచంపైనే ఉన్న ఆయన్ను ఆరోగ్యం విషమించడంతో కర్నూలులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఫిబ్రవరి 22 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(11-మార్చి-2013) సాయంత్రం 6 గంటలకు మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.

అవార్డులు.. ప్రశంసలు
డాక్టర్‌ పినాకపాణి ప్రతిభను గుర్తించిన సంగీత ప్రపంచం ఆయన్ను ఎన్నో సత్కారాలతో గౌరవించింది. ఆకాశవాణి కేంద్రాల ద్వారా తన సంగీతాన్ని ప్రజలకు చేరువచేసిన పినాకపాణి 14 సంగీత నాటక అకాడమీల నుంచి గౌరవ పురస్కారాలు పొందారు.
* 1966లో ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ ద్వారా గాన కళాప్రపూర్ణ బిరుదు, 1970లో మద్రాస్‌లోని ఇండియన్‌ ఫైన్‌ఆర్ట్స్‌ సొసైటీ నుంచి సంగీత కళాశిఖామణి అందుకున్నారు.
* 1973లో విశాఖ మ్యూజిక్‌ అకాడమీ నుంచి గానకళాసాగర బిరుదును, 1976లో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సప్తగిరి సంగీత విద్వాన్‌మణి స్వీకరించారు.
* 1974లోనే తితిదే పినాకపాణిని ఆస్థాన విద్వాంసుడిగా నియమించింది. 1978 మార్చి 27న సెంట్రల్‌ సంగీత నాటక అకాడమీ 40 ఏళ్లపాటు సంప్రదాయ కర్ణాటక సంగీతానికి ఆయన చేసిన సేవలను గుర్తించింది. అద్భుతమైన కంఠస్వరం కలిగిన పినాకపాణి సంగీతాన్ని రికార్డు చేసి నేషనల్‌ ఆర్కివ్స్‌లో భద్రపరచడం ద్వారా ప్రత్యేక గౌరవాన్ని ఇచ్చింది.
* 1983లో మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడమీ నుంచి సంగీత కళానిధి, 1984లోఅప్పటి రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌ చేతుల మీదుగా పద్మభూషణ్‌ అవార్డు అందుకున్నారు.
* గాన రుషి, గాన కళాప్రపూర్ణ, సంగీత కళాశిఖామణి గానకళాసాగర, సప్తగిరి సంగీత విద్వాన్‌మణి... ఇలాంటివెన్నో.

ప్రొఫైల్  :

పేరు : డా .శ్రీపాద పినాకపాణి(Dr.Sripada Pinakapani-MD),
తల్లిదండ్రులు : జోగమ్మ, కామేశ్వరరావు,
వైద్య పట్టా : MBBS, MD-1939,
కర్నూలుకు బదిలీ : 1957,
పదవీవిరమణ : 1968,
రాసిన పుస్తకాలు: సంగీత సౌరభం, పాణినీయం, స్వరరామమ్‌, నా సంగీత యాత్ర తదితరాలు,
సతీమణి : బాలాంబ,
కుటుంబం : కామేశ్వరరావు, శ్యామ్‌కృష్ణ, రాఘవ, డాక్టర్‌ మువ్వగోపాల్‌, కుమార్తె జానకి . పెద్దకుమారుడు కామేశ్వర్‌రావు కుమార్తె చిన్మయి ప్రస్తుతం సినిమా పాటలు, డబ్బింగ్‌ కళాకారిణి.
* సంగీతం నాకు శ్రీకృష్ణభగవానుడు ఇచ్చిన వరం. పాత కాలం నాటి సంగీత విద్వాంసులు అందించిన సాహిత్యాన్ని భద్రపరచి నేటి తరాలకు అందివ్వాలి.
ఆయన వందోవసంతం సందర్భంగా  అన్న మాటలివి.

యువకుడిగా...
కొందరికే పరిమతమైన వైద్యవిద్యలో ఆయన ఎండీ చేశారు. మంచి శారీరక దృఢత్వం గల వ్యక్తి. ఇందుకు ఆయన ప్రత్యేక కసరత్తులు చేసి కండలుతిరిగిన దేహంతో యువకులకు ఆయన స్ఫూర్తి. చదువుకుంటూనే సంగీత కచేరీలు చేశారు. చదువులోనే గట్టెక్కలేక ఇబ్బందులు పడుతున్న నేటి తరానికి ఆ రోజుల్లోనే విద్యలో రాణించి... తన సంగీతాభిలాషవైపు అడుగులు వేసిన ఆయన నేటి యువతకు ఆదర్శం.

మధ్యవయస్కుడిగా
కర్నూలు సర్వజన వైద్యశాలలో వైద్యుడిగా, పర్యవేక్షకులుగా ఆయన సేవలు అందించారు. పేదల వైద్యుడిగా పేరుగాంచారు. ఎవరైనా పేదలు చికిత్సకోసం ఇంటికి వస్తే... వద్దు మీరు ప్రభుత్వ ఆసుపత్రికి రమ్మని చెప్పి ఉచిత సేవలు అందించే గొప్ప మనస్కుడు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను ఇంటికి రమ్మని అధిక రుసుం వసూలు చేసే వైద్యులకు ఆయన మార్గం అనుసరణీయం.

వృద్ధుడిగా...
1968లో పదవీవిరమణ పొందిన తర్వాత ఆయన తన దృష్టిని సంగీతంపై పెట్టారు. ఈ రంగంలో ఎవరెస్టు శిఖరాలనే అధిరోహించారు. కర్ణాటక సంగీత లోతుపాతులు పరిశీలించారు. సంగీతంపై పుస్తకాలు రాశారు. ఈ రంగంలో ఆయన కృషికి భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో సత్కరించింది.

పదవీవిరమణ పొందిన తర్వాత హాయిగా ఇంట్లో కూర్చొందాం. ఇంకేం చేయగలం? ఏం సాధించగలం? అని ఆలోచించి సగటు మనిషికి ఆయన జీవితమే పాఠం. ఆ...మనమేం చేయగలం? మనమేమి గెలవగలం? అని సరిపెట్టుకుంటున్న యువతకు ఆయన మార్గం గుణపాఠం.

పినాకపాణి కర్నూలులో నివాసం ఏర్పరుచుకోవడం ఈ జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టమని ప్రముఖలు అంటున్నారంటే... ఆయన జీవితం నుంచి మనం ఎన్ని నేర్చుకోవచ్చు అర్థంచేసుకోండి.

మహా విద్వాంసుడు 'శ్రీపాద'
ఇటు వైద్యరంగంలోనే కాకుండా సంగీత కళా సేవ చేసిన మహా విద్వాంసుడు శ్రీపాద పినాకపాణి. ఆయన డాక్టరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి విద్వాంసులకు ఆదర్శప్రాయుడు. నేను కర్నూలులో శ్రీపాద పినాకపాణితో కలిసి సంగీత సభల్లో  పాల్గొన్నాను. దేశంలో పేరెన్నికగన్న సంగీతజ్ఞుల సరసన నిలిచి సంగీత కళా ప్రపంచంలో తనదైన బాణీలో ఖ్యాతి గడించారు.

శ్రీకాకుళం జిల్లాలో ఆయన ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాలు తక్కువే. మన జిల్లాకు చెందిన శ్రీపాద చనిపోవడం జిల్లావాసులకు, సంగీతరంగానికి తీరని లోటు. - సంగీతవిద్వాంసులు బండారుచిట్టిబాబు

సంగీత స్వరం మూగపోయింది
ఓ సంగీత స్వరం మూగపోయింది. సంగీత సరస్వతి ఖిన్నురాలైంది. సంగీతకళా శిఖామణి పినాకపాణి మనజిల్లావారు కావడం మన అదృష్టం.ప్రియాగ్రహారానికి చెందిన ఆయన దేశంలో సంగీత కచేరీలు చేసి మనజిల్లా పేరును ఇనుమడింప చేశారు. డా. రమణరావు లాంటివారు ఆయనకు మంచి స్నేహితులు. గత డిసెంబరు నెలలో ఇంటాక్‌ సంస్థ తరపున శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిరంలో శ్రీపాదకు వందేళ్లు నిండిన సందర్భంగా గాయత్రీ కౌండిన్య శాస్త్రీయ సంగీత కచేరీ ఏర్పాటు చేశాం. - - దూసిధర్మారావు

  • =========================
Visit my website -> Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment