Monday, May 3, 2010

కాంతారావు.ఎస్ , Kantharao.S




జిల్లాకు చెందిన ఎస్‌.కాంతారావు జులై 27 నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు స్వీడన్‌లో జరుగనున్న 13వ ఫీనా వరల్డ్‌ మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఎచ్చెర్లలో ఎ.ఆర్‌.కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎస్‌.కాంతారావు పోలాకి మండలం వనిత మండలం గ్రామానికి చెందినవాడు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన కాంతారావు చిన్ననాటి నుంచి ఈతపై మక్కువ పెంచుకున్నాడు. తమ గ్రామం సమీపాన గల వంశధార నదిలో రోజూ స్నానానికి వెళ్తూ ఈత నేర్చుకున్నాడు. 1990లో విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి గ్రామీణ ఈత పోటీల్లో తొలిసారిగా పాల్గొని 50 మీటర్లు, 100 మీటర్లు ఫ్రీ స్త్టెయిల్‌ విభాగంలో స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకున్నాడు. అప్పటినుంచి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు కైవసం చేసుకున్న కాంతారావు 1996లో క్రీడల కోటాలో ఎ.ఆర్‌. కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందాడు. కాంతారావు ప్రస్తుతం ఓ పక్క ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే క్రమం తప్పక ఈత సాధన చేస్తూ పలువురికి శిక్షణ ఇస్తున్నాడు. ఇతని శిక్షణలో పలువురు జాతీయస్థాయి ఈత పోటీల్లో రాణిస్తూ వస్తున్నారు.

సాధించిన పతకాలు
* 2000లో విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో వివిధ అంశాల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు కైవసం
* 2002లో కర్నూల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో వివిధ అంశాల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు కైవసం.
* 2003లో గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో నాలుగు స్వర్ణపతకాలు కైవసం.
* 2004లో వరంగల్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో నాలుగు స్వర్ణ, రెండు రజత, ఒక కాంస్య పతకం కైవసం.
* 2009లో నెల్లూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మూడు స్వర్ణ, రెండు రజత పతకాలు కైవసం.
* ఈ ఏడాది మార్చిలో గుజరాత్‌లో జరిగిన ఆలిండియా మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో స్వర్ణ పతకం కైవసం చేసుకుని స్వీడన్‌లో జరుగనున్న 13వ ఫీనా వరల్డ్‌ మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలకు ఎంపికయ్యాడు.

పోలీస్‌ క్రీడల పోటీల్లో
* 2007లో కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి పోలీసుల ఈత పోటీల్లో నాలుగు స్వర్ణ, రెండు రజత పతకాలు కైవసం.
* 2008లో కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోలీసుల ఈత పోటీల్లో ఆరు స్వర్ణ, ఒక రజత పతకం కైవసం
* 2001లో 2002 ఢిల్లీ, 2003 మహారాష్ట్ర, 2004లో ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోలీసు ఈత పోటీలకు ప్రాతినిధ్యం వహించాడు.
స్వీడన్‌లో జరగనున్న ప్రపంచ మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొని పతకం సాధించటమే ఆశయమని కాంతారావు పేర్కొన్నాడు. అలాగే ఆసక్తి గల అందరికీ ఈతలో శిక్షణ ఇస్తూ జాతీయస్థాయిలో ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనేది ఆశయమని తెలిపాడు.


  • ==========================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Sunday, May 2, 2010

బొంగు సూర్యనారాయణ , Bongu Suryanarayana


బొంగు సూర్యనారాయణ టెక్కలి మండలం పిఠాపురం గ్రామానికి చెందిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు. తెలుగు సాహితీలోకం లో తన రచనామృతంతో సాహితీ ప్రియులను మంత్రముగ్ధుల్ని చేయడమేకాకుండా ఆదిత్యుడి(సూర్య దేవుని)సేవలో తరిస్తూ , మూలికా వైద్యంతో ప్రజల రోగాలను నయం చేస్తున్న బహువిద్యాకోవిదుడు . ఈయన రచించిన
  • సుప్రభాత సహిత సూర్యశతకం ,
  • శ్రీరామక్రిష్ణ యుద్ధం ,
  • నవ్యాంధ్ర సుమతీ శతకం ,
  • రావివలస ఎండల్ మల్లిఖార్జున స్వామివారి క్షేత్ర మహత్యం ,
  • లీలావతార గాధ ,
  • వెంకటేశ్వర శతకం ,
  • శివక్షేత్ర మహర్యం ,

వంటి పద్యకావ్యాలు పుస్తక రూపం లో విడుదలై ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి .

టెక్కలి బోర్డు హైస్కూల్ లో ఎస్.ఎల్ ఎల్.సి . వరకు చదివిన ఇతడు దూరవిద్యద్వారా ఆంధ్ర విశ్వవిద్యాలయం లో భాషాప్రవీణ కొర్సు పూర్తిచేసారు . చిన్నతనం లో తనతండ్రి నర్సింహం ప్రోత్సాహంతో తెలుగుభాషపై మక్కువ పెంచుకుని తెలుగుభాషకీర్తిని నలుదిసలా విస్తరించాలని నిరంతర కృషి చేస్తున్నారు . ఇందుకోసం టెక్కలి పాతజాతీయ రహదారిపై పౌరాణిక గ్రంధాలయం ఏర్పాటుచేసి పురాతన గ్రంధాలను అందరికీ అందుబాటులో ఉంచారు .

ప్రశంసలు ... పురస్కారాలు :
  • 2006 లో విశాఖపట్నం శారదాపీఠం చేపట్టిన కార్యక్రమం లో ఆచార్య సార్వభౌమ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి చే " మధురకవి " బిరుదు ,
  • 2006 లో శారదాపీఠం వారిచే " నవ్యాంధ్రకవి " బిరుదు ,
  • 2006 లో సాహిత్య బ్రహ్మ వి.వి.ఎల్.నర్షింహరావు హైదరాబాద్ వారి " అపరపింగళసూరన " బిరుదు ,
  • 2008 లో కడప లో మహాకవి గడియారం వేంకటశేషశాస్త్రి స్మారక పురస్కారం అందుకున్నారు .
  • 2009 లో శ్రీనన్నయభట్టారక పీఠం తణుకు వారి తంగిరాల వెంకటస్వామియాజి పద్యకావ్య్ పురస్కారం తో పాటు " కవిశేఖర " బిరుదు .
టెక్కలి పాతజాతీయ రహదారి ప్రక్కన 1983 లో తన సొంత స్థలం లో సూర్యనారాయణమూర్తి ఆలయాన్ని నిర్మించిన ఇతను ప్రస్తుతం ఆలయం లో అర్చకత్వం నిర్వహిస్తూ భానుడి సేవలో తరిస్తున్నారు . తన తండ్రి నర్సింహం వద్ద వంశపారంపర్యం గా నేర్చుకున్న విద్యతో మహర్షి మూలికా వైద్యశాలను ఏర్పాటు చేసారు .

///సేకరణ -- డా.శేషగిరిరావు -శ్రీకాకుళం ///

  • ==========================================
Visit my website -> Dr.seshagirirao-MBBS