Thursday, April 29, 2010

కనకమహలక్ష్మి(సంగీత కళాకారిణి) ,Kanakamahalakshmi(Music Artist)





కనకమహలక్ష్మి పుట్టినిల్లు, ఇటు మెట్టినిల్లు కుటుంబమంతా సంగీత కళాకారులే కావడం విశేషం. అదే ఒరవడిలో భార్యాభర్తలు, పిల్లలు కూడా సంగీత వాద్యకళాకారులుగా రాణిస్తుండటం

స్ఫూర్తిదాయకం. పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న దూసి గ్రామంలో దూసి కనక మహలక్ష్మి, భర్త రమేష్‌, కుమారుడు తారకరామలు వాద్య సంగీతంలో రాణిస్తున్నారు.

రసవనముల దూసిలో స్వరసుమాలు కోసి సప్త స్వరాలుగా పేర్చిన ఆ సంగీత కుటుంబం అందరికీ స్ఫూర్తిదాయకం.

దూసి కనకమహలక్ష్మి విజయనగరం మహారాజ సంగీత నృత్య కళాశాలలో భరతనాట్యం, నాలుగేళ్ల వీణావాయిద్యం కోర్సులో ధ్రువపత్రం, గాత్ర సంగీతంలో డిప్లొమో అందుకుని ప్రదర్శనలిస్తున్నారు. ఈమె తండ్రి వైణిక విద్వాంసులు దివంగత కవిరాయుని జోగారావు సంగీత కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. ఈమె అక్కా చెల్లెలు సంగీతంలోను, తమ్ముడు శాస్త్రి వీణ అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. కాకినాడ, విశాఖపట్టణాల్లో ప్రదర్శనలిచ్చిన కనకమహలక్ష్మి మూడేళ్లు కళాపరిచయం శిక్షణ ఇచ్చారు. తిరుపతి బ్రహ్మోత్సవాలు, సునాదవినోదిని,

ధర్మప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ఎన్నో ప్రదర్శనలిచ్చారామె. విభిన్న ప్రక్రియల్లో వైవిద్యం ఉన్న ఆమె ఆకాశవాణి 'బి' గ్రేడు కళాకారిణి. అప్పట్లో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి ప్రదర్శనలిచ్చారు. ప్రభుత్వం స్థలం ఇస్తే సంగీత పాఠశాల ఏర్పాటుచేసి ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వాలని కోరిక ఉందని ఆమె చెప్పారు.

కనకమహలక్ష్మి భర్త దూసి రమేష్‌. దూసిలోనే పంతులు సత్యానారాయణ వద్ద సంగీతం నేర్చుకుని విజయనగరం సంగీత కళాశాలలో వయోలిన్‌ వాదనలో సర్టిఫికెట్‌ కోర్సు చేశారు. తొలుత డి.ఎ.వి.పబ్లిక్‌ స్కూలులో సంగీతం ఉపాధ్యాయునిగా, ప్రస్తుతం వెన్నెలవలస నవదోయ విద్యాలయంలో సంగీతం ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. హార్మోనియం, కేషియో, వయోలిన్‌లతో హరికథా కళాకారులకు గాత్ర సంగీత కళాకారులకు పక్క వాద్య కళాకారునిగా సహకారం అందిస్తున్నారు.

రమేష్‌ తల్లి పాపాయమ్మ మంచి వైణిక విద్వాంసురాలు. వీరి కుమార్తె లక్ష్మీ, మాణిక్య, సౌమ్య, గాత్ర సంగీతంలోను, కుమారుడు డి.ఎస్‌.వి.ఎన్‌. తారకరామ మృందంగం విద్యను నేర్చుకుంటూ ప్రదర్శనలిస్తున్నారు. తారకరామ సునాద వినోదిని ఎం.కె.ఆర్‌.ప్రసాద్‌ వద్ద మృదంగం నేర్చుకున్నారు. ఇంటర్మీడియట్‌ చదివిన తారకరామ ఇటీవల విశాఖలో సంగీత కళాసమితి పోటీల్లో మొదటి బహుమతి పొందారు.

  • =========================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Tuesday, April 20, 2010

స్వాతిసోమనాధ్‌, Swati Somanadh




ప్రముఖ నృత్య కళాకారిణి స్వాతిసోమనాధ్‌ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం దూసి గ్రామంలో పుట్టి పెరిగి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ప్రముఖ నృత్య కళాకారిణి స్వాతి సోమనాధ్‌. తెలుగు సాంప్రదాయ నృత్యం 'కూచిపూడి'ని ఎన్నో సంగీత రూపకాలలో సుమారు 46 దేశాలలో ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా చిక్కోలు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఏకైక మహిళ ఆమె. ఇంటాక్‌ సంస్థ ఇచ్చే 'ఉత్తమ కళాకారిణి' అవార్డు తీసుకునేందుకు శ్రీకాకుళం వచ్చినాు .

శాస్త్రీయ నృత్యానికి ఎలాంటి భవిష్యత్తు ఉందంటారు? - అస్సలు లేదు. శాస్త్రీయ నృత్యానికి భవిష్యత్తు లేదనే అనుకుంటున్నాను. శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం ద్వారా సమయం వృధా అనే భావనలో ఎక్కువమంది తల్లిదండ్రులు

ఉన్నారు. మంచి నృత్యకళాకారిణిగా కంటే ఇంజనీర్‌గానో, వైద్యుని గానో తమ పిల్లలు స్థిరపడాలనే తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. వ్యాపారధోరణి కూడా బాగా పెరిగిపోయింది. నేర్చుకోవడం మొదలుపెట్టిన రెండు మూడేళ్లకే లెక్కలేనన్ని ప్రదర్శనలు ఇచ్చేసి ప్రముఖ కళాకారిణులు అయిపోవాలనే తపన ఎక్కువైంది.

కూచిపూడి నృత్యం అభివృద్ధికి, విస్తరణకు మీరు చేస్తున్న కృషి ఏమిటి? - తాను ఇప్పటివరకు ఆరువేల మందికి పైగా విద్యార్థులను తీర్చిదిద్దగలిగాను. చివరికి పరిస్థితులు చూసి హైదరాబాద్‌లో నృత్యం నేర్పడం వృధా అనుకునే స్థాయికి చేరుకున్నాను. ఒక కూచిపూడి నృత్య కళాకారిణిగా మా తరమే చివరిది అనే అనుకుంటున్నాను. దూసి గ్రామంలో ఇప్పటికే రెండు ఎకరాల స్థలం కొనుగోలు చేయడం జరిగింది. త్వరలో కేంద్రం నెలకొల్పి జిల్లావాసులకు శిక్షణ
ఇద్దామనుకున్తున్నాను.

సెన్సార్‌ బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్న మీరు చెడు సినిమాలను ఎంతవరకు నియంత్రించగలుగుతున్నారు? - సెన్సార్‌బోర్డు అధికారాలు నామమాత్రం అయిపోవడం వలన అనుకున్న స్థాయిలో చేయలేకపోతున్నాయి. మేము
చేసిన కటింగ్‌లు మళ్లీ సినిమాల్లో ప్రత్యక్షమవుతున్నా ఏమి చేయలేని నిస్సహాయస్థితిలో కొనసాగుతున్నాం. మా సభ్యులందరూ కచ్చితంగా పనిచేస్తే సినిమాలలో పేర్లు తప్ప దృశ్యాలు మిగలవు.

తెలుగు సినిమా ప్రస్థానం ఎలా ఉందనుకుంటున్నారు?- విలువలు అయితే పూర్తిగా తగ్గిపోయాయి. రూ.కోట్లు, మంచిపేరు సంపాదించిన టాప్‌ పదిమంది తెలుగు హీరోలు కూడా హిందీ హీరోలు అమీర్‌ఖాన్‌, షారుఖ్‌ఖాన్‌ల మాదిరి
మంచి సినిమాలు తీయడానికి సాహసించకపోవడం దారుణం.


  • ================================================
Visit my website -> Dr.seshagirirao-MBBS

Monday, April 12, 2010

పైల వాసుదేవరావు , Paila Vaasudevarao




శ్రీకాకుళం జిల్లాలో గిరిజన సాయుధ పోరాటాన్ని ప్రారంభించి, పెత్తాందారీ వ్యవస్థపై తుపాకీని ఎక్కుపెట్టి, గిరిజనోధ్దరణకు నడుంబిగించిన ఉద్యమ నాయకుడు పైలా వాసుదేవరావు ఆదివారం మరణించినట్లు తెలుసుకున్న జిల్లా ప్రజలు నిట్టూర్పు విడిచారు. జిల్లాలో నక్సలైట్ల ఉద్యమాన్ని ప్రారంభించిన ముఖ్యనాయకులైన ఆదిబట్ల కైలాసం, వెంపటాపు సత్యం వంటి నాయకులు పోలీసుల చేతుల్లో మరణించిన తరువాత ఉద్యమం ఏవిధంగా ముందుకు వెళుతుందని డీలాపడిన నక్సలైట్ల ఉద్యమానికి నాయకత్వం వహించి, జిల్లాలో భూస్వాములపై ఉధృతమైన పోరాటాలు సాగించి, గిరిజన హక్కుల పరిరక్షణకు ఎంతగానో కృషిచేసిన పైలా వాసుదేవరావు తన జీవితకాలంలో సగానికిపైగా అజ్ఞాతంలోనే గడిపారు. అజ్ఞాతంలోనే ఆఖరివరకూ గడిపి తుదిశ్వాశ విడిచారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆయన చేసిన పోరాటాలు నిరుపమానం. పెత్తందారీ వ్యవస్థపై ఆయన ఉద్యమాలు ప్రభుత్వాలను గడగడలాడించాయి. గిరిజన ప్రజలను ఆకర్షింపచేశాయి. ఆయన చేసిన ఉద్యమాలు శ్రీకాకుళం జిల్లానుంచి హైదరాబాద్‌ వరకూ ప్రభుత్వాలను, పోలీసులను నిద్దురలేకుండా చేశాయి. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టిన ఆయన హైదరాబాద్‌లోనే ఆదివారం తుదిశ్వాశ విడిచారు. వివాహం చేసుకున్నప్పటికీ, ఒక పాప పుట్టిన తరువాత ఉద్యమానికి ఎక్కడ కడుపు తీపి, మమకారం అడ్డుతగులుతాయోనని భావించిన పైలా పుట్టిన పాపను బంధువులకు అప్పచెప్పి ఉద్యమారణ్యంలోకి వెళ్లిపోయారు.

పైలా ఉద్యమ జీవితం సాగిందిలా...

పైలా వాసుదేవరావు 1932 సంవత్సరం ఆగస్టు 10వ తేదీన బాణాపురం అనే గ్రామంలో జన్మించారు. అతని తల్లిదండ్రులు అమ్మాయమ్మ, అప్పోజినాయుడు. వజ్రపుకొత్తూరు మండలం రిట్టపాడు గ్రామంలో పెరిగి ఎస్‌ఎస్‌ఎల్‌సి వరకు కాశీబుగ్గలో చదువుకున్నారు. ఆయనకు 20 సంవత్సరాల వయస్సునాటికే కమ్యూనిస్టు ఉద్యమాలు, భావాల పట్ల ఆకర్షితులై 1952లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకుని అప్పటి కమ్యూనిస్టు ఉద్యమ నాయకులైన డిబికె చౌదరి మరికొందరితో కలసి కమ్యూనిస్టు పార్టీలో చురుకుగా పాల్గొన్నారు. 1964వ సంవత్సరంలో టెక్కలి తాలూకా వ్యవసాయ కార్మిక సంఘానికి కార్యదర్శిగాను, జిల్లా సంఘానికి సహాయ కార్యదర్శిగాను ఎన్నికయ్యారు. మొదట సర్వే డిపార్టుమెంట్‌లో పనిచేసి ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి 1961వ సంవత్సరంలో ఉపాధ్యాయునిగా సోంపేట తాలుకా జీడిపుట్టుగలో పనిచేశారు. అక్కడనుంచే శ్రీకాకుళం గిరిజన సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభించారు. 1968 నవంబరు 25వ తేదీన పైలా అజ్ఞాత జీవనంలోకి వెళ్లి ప్రజా పోరాటాలు కొనసాగించారు. 1970లో వజ్రపుకొత్తూరు మండలం రాజాం గ్రామానికి చెందిన చెల్లూరి చంద్రమ్మను మందస ఏజెన్సీలో వివాహం చేసుకున్నారు. 1971లో వారికి ఒక పాప జన్మించింది. ఆ పాపను ఇతరులకు పెంచుకోవడానికి ఇచ్చారు. పూర్తిస్థాయిలో ఉద్యమాలకే ఆయన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. పంచాది కృష్ణమూర్తి, సుబ్బారావుపాణిగ్రహి, వెంకటాపుసత్యం, ఆదిభట్ల కైలాసం అప్పట్లో నక్సలైట్ల ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహిస్తూ ఉండేవారు. అయితే వీరు వరుస ఎన్‌కౌంటర్లలో చనిపోయిన తరువాత పైల వాసుదేవరావు నక్సలైట్ల ఉద్యమానికి నాయకత్వం వహించిచెల్లా చెదురైన ఉద్యమాన్ని ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో సంఘటితం చేసి ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లారు.

పైలా కె.జి.సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్య, రావుఫ్‌లతో కలసి రాష్ట్ర కమిటీ ఏర్పాటు కాగా దాంట్లో పైలా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పైలా వాసుదేవరావుపై శ్రీకాకుళం జిల్లా నలుమూలలా 40కి పైగా పోలీసు కేసులు ఉన్నాయి. సోంపేట తాలుకా బొరివంకలో జంట హత్యల కేసులోనూ, వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం సంఘటనలోను పైలా ముద్దాయి. అలాగే మజ్జి తులసీదాస్‌పై పలుమార్లు దాడికి ప్రయత్నించారు. కిల్లోయి బంజరు సార అప్పన్న హత్య కేసులో కూడా పైల ముద్దాయి. మెళియాపుట్టి మండలంలో ఏర్పడిన చందనగిరి దళానికి 1969నుండి 1972 వరకు పైల వాసుదేవరావు నాయకత్వం వహించారు. ఈయన నాయకత్వంలోనే డేగల పోలూరులో భూస్వామి జయచంద్రపాణిగ్రహి అలియాస్‌ గాలిబాబును తల నరికి అతని ఇంటికే వేలాడదీశారు. ఈ సంఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం కలిగించింది. భూస్వాముల గుండెల్లో ఆందోళన కలిగించింది. 1975లో మందస మండలం రామరాయి కొండల్లో పైల వాసుదేవరావు, చంద్రక్క, కుమార్‌తోపాటు మరికొందరు రాష్ట్ర స్ధాయి సమావేశం జరుపుతుండగా పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో కుమార్‌ చేయికి బుల్లెట్లు తగిలి చేయిపోగా చంద్రమ్మ పోలీసులకు చిక్కారు. పైల వాసు మాత్రం తప్పించుకున్నారు. ఆనాటినుంచి నేటివరకు ఆయన జీవితం అజ్ఞాతంలోనే సాగింది. గత కొంతకాలంగా ఆరోగ్యం సరిగా లేక ఉద్యమాలకు దూరంగా ఉంటూ రహస్యంగా వైద్య సేవలు పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. అతనిపై పోలీసు కేసులు ఎన్ని ఉన్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా ప్రజల హృదయాల్లో పైల వాసుదేవరావు గుర్తుండిపోయారు.

వాసుదేవరావు 11-ఏప్రిల్ 2010 తేదీన స్వర్గస్తులైనారు . ఆయన జ్ఞావకార్థం. స్వగ్రామం(పెరిగిన గ్రామము) రిట్టపాడులో స్థూపం ఏర్పాటు చేస్తున్నారు. వ్రథమ వర్థరతి సభ 11-04-2011 న విశాఖవట్నం పౌర గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు న్యూడెమక్రసీ జిల్లా నాయకురాలు, పాసుదేవరావు భార్య పైల చంద్రమ్మ తెలిపారు.


మూలము : ఆంధ్రప్రభ దినపత్రిక 12/ఏప్రిల్ /2010
  • ===================================================
Visit my website -> Dr.seshagirirao-MBBS